Sunil Deodhar: వైసీపీ ఎన్డీయేలో చేరుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై తేల్చేసిన సునీల్ దేవధర్!
- జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో తీవ్రస్థాయిలో ఊహాగానాలు
- వైసీపీ నేతలకు కేంద్రమంత్రి పదవులంటూ ప్రచారం
- తమకు వైసీపీ రాజకీయ ప్రత్యర్థి అని స్పష్టం చేసిన సునీల్ దేవధర్
- జనసేనతో తప్ప ఎవరితో పొత్తులేదని స్పష్టీకరణ
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వైసీపీ, బీజేపీ మధ్య సయోధ్య నెలకొందని, వైసీపీ నేతలకు కేంద్రమంత్రి పదవులు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ స్పష్టతనిచ్చారు. తమకు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీతో కానీ, టీడీపీతో కానీ ఎలాంటి పొత్తు లేదని వెల్లడించారు. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటోందన్నది ప్రచారం మాత్రమేనని అన్నారు. ఈ విషయంలో అనేక రకాల డిబేట్లు, కథనాలు వచ్చాయని తెలిపారు.
"జగన్ ఢిల్లీలో మోదీని, అమిత్ షాను కలిసిన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీ ఎన్డీయేలో చేరుతున్నట్టు ప్రచారం మొదలైంది. ఇక్కడ నేను మీకో స్పష్టతనివ్వాలి. దేశంలోని ప్రతిరాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉంటుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా, మరే ఇతర ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్డీయే వైఖరిలో మార్పు ఉండదు. అన్ని రాష్ట్రాలను సమభావంతోనే చూస్తాం. అందరినీ సమదృష్టితో చూడడమే ప్రధాని మోదీ సిద్ధాంతం. ఏపీలో మాకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ, విపక్షంగా ఉన్న టీడీపీ మాకు రాజకీయ ప్రత్యర్థులే తప్ప మరొకటి కాదు" అని ఆయన స్పష్టం చేశారు.