Devineni Uma: ఏడుసార్లు ఢిల్లీ వెళ్లారు.. నాలుగు సార్లు ప్రధానిని కలిశారు.. ఎన్ని నిధులు తెచ్చారు?: సీఎం జగన్ ను నిలదీసిన దేవినేని
- టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీకి మూడో స్థానం
- చంద్రబాబు పాలనలో రూ.70వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి
- వైసీపీ 9 నెలల పాలనలో రూ.లక్షా ఎనబైవేల కోట్ల పెట్టుబడులు వెళ్లిపోయాయి
రాష్ట్రంలో ఆర్థిక అత్యవసరపరిస్థితి వస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదని అన్నారు. రైతులకు తగిన గిట్టుబాటు ధర రావడంలేదన్నారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడం లేదని విమర్శించారు. దళారులు రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతుల దీన పరిస్థితిపై వ్యవసాయమంత్రి, మార్కెటింగ్ మంత్రి.. సీఎం పట్టించుకోవడం లేదన్నారు.
సుబాబుల్, ధాన్యం రైతులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మిర్చి రైతులు దోపిడికి గురవుతున్నారన్నారు. 'ఏడు సార్లు ఢిల్లీ వెళ్లారు. నాలుగు సార్లు ప్రధానిని కలిశారు. ఎన్ని నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చారు?' అని ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు. 2018-19లో అత్యధిక ప్రవేటు పెట్టుబడులు ఏపీకి వచ్చాయన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో తొలి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయన్నారు. ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. దీనిపై మీరేమంటారని దేవినేని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రభుత్వం రూ.70వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో లక్షా ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంనుంచి బయటకు వెళ్లిపోయాయన్నారు. ఇవన్నీ ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలేనని దేవినేని పేర్కొన్నారు.