IT Raids: చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో సోదాలపై ఐటీశాఖ పంచనామాలో కీలక విషయాలు!
- పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఐదు రోజులపాటు సోదాలు
- రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులు బయటపడినట్టు వైసీపీ నేతల ఆరోపణలు
- వాస్తవం కాదని తేల్చేసిన ఐటీ శాఖ పంచనామా
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఇటీవల జరిగిన ఐటీ దాడులు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ దాడుల్లో రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయన్న వార్తలు కలకలం రేపాయి. ఐదు రోజులపాటు దాడులు జరగడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమైంది. అయితే, ఈ దాడులపై ఆదాయ పన్ను శాఖ తయారుచేసిన పంచనామా నివేదికలోని కొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
బయటకు వచ్చిన నివేదికపై శ్రీనివాస్, ఐటీ అధికారుల సంతకాలు కూడా ఉన్నాయి. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన దాడుల్లో రూ.2 వేల కోట్ల ఆస్తులు బయటపడ్డాయన్న దాంట్లో నిజం లేదని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. కేవలం రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు మాత్రమే లభ్యమైనట్టు పంచనామా నివేదికలో ఐటీ పేర్కొంది. సోదాల సందర్భంగా లభ్యమైన బంగారు ఆభరణాలను సీజ్ చేయలేదని అధికారులు పేర్కొన్నారు.