- సర్వీసు రైఫిల్ తో కాల్చిన హెడ్ కానిస్టేబుల్
- తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగుబాటు
- పంజాబ్ లోని మోగా జిల్లాలో ఘటన
ఇంట్లో జరిగిన ఫ్యామిలీ గొడవలతో పట్టరాని కోపం వచ్చిన ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ తన సర్వీసు రైఫిల్ తో భార్యను, ఆమె తల్లిగారి ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చి చంపేశాడు. పంజాబ్ లోని మోగా జిల్లాలోని జలాల్ పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ముందురోజే రైఫిల్ తెచ్చుకుని..
జలాల్ పూర్ కు చెందిన కుల్విందర్ సింగ్ మోగా పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా వారి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం డ్యూటీకి వెళ్లిన కుల్విందర్ తన సర్వీస్ రైఫిల్ ను ఇంటికి తీసుకొచ్చాడు. ఆదివారం ఉదయం మళ్లీ గొడవలు జరిగాయి. ఆ సమయంలో తీవ్రంగా ఆగ్రహానికి గురైన కుల్విందర్ లోపలి నుంచి రైఫిల్ తీసుకొచ్చి అందరిపైనా కాల్పులు జరిపాడు.
ఒక్కరు తప్ప అందరూ మృతి
కుల్విందర్ సింగ్ కాల్చడంతో ఆయన భార్య, అత్త (భార్య తల్లి), బావ మరిది, మరదలు అక్కడికక్కడే చనిపోయారు. బావ మరిది పదేళ్ల కుమార్తెకు కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ చేస్తున్నారు.
నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి..
ఇంట్లోకాల్పులు జరిపిన కుల్విందర్ తర్వాత నేరుగా రైఫిల్ తో సహా మోగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఇంట్లో జరిగిన ఘటన గురించి చెప్పాడు. పోలీసులు కుల్విందర్ ను అరెస్టు చేశారు.