YSRCP: వైసీపీది ఢిల్లీలో ఒక మాట.. అమరావతిలో మరోమాట: శైలజానాథ్
- ‘రాష్ట్ర ప్రయోజనాలు’ అనే పదం ఊత పదంగా మారిపోయింది
- బీజేపీకి వైసీపీ నమ్మకమైన మిత్ర పక్షంగా మారింది
- బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడం వెనక ఆంతర్యం ఏమిటి?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ సాకే శైలజానాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారు ఒక్కో చోట ఒక్కోలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలపై వైసీపీ నేతలు ఢిల్లీలో ఒకలా, అమరావతిలో మరోలా మాట్లాడుతూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో నిన్న మీడియాతో మాట్లాడిన శైలజానాథ్.. ప్రస్తుతం ‘రాష్ట్ర ప్రయోజనాలు’ అనే పదం ప్రతి ఒక్కరికీ ఓ వాడుక పదంలా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పిన చంద్రబాబు అప్పట్లో ఏమీ సాధించలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు శాసన మండలిని రద్దు చేయాలని ఢిల్లీ పెద్దలను జగన్ కోరడం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా? అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ నేతలు ఊదరగొడుతున్నా.. వారి కాళ్లు పట్టుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని నిలదీశారు. బీజేపీకి వైసీపీ అత్యంత విశ్వసనీయ మిత్ర పక్షంగా మారిందని శైలజానాథ్ ఆరోపించారు.