Sivasena: గరీబీ చుపావ్ ... ట్రంప్ కోసం మోదీ తాజా నినాదమిదేనన్న శివసేన!
- ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై నిప్పులు
- గోడల వెనకున్న పేదరికాన్ని దాస్తున్నారు
- మూడు గంటల కోసం రూ. 100 కోట్ల ఖర్చా?
- 'సామ్నా' సంపాదకీయంలో విసుర్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించనున్న వేళ, ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై శివసేన నిప్పులు చెరిగింది. పలు ప్రాంతాల్లో ట్రంప్ కు గుడిసెలు కనిపించకుండా, ఆయన కాన్వాయ్ సాగే దారిలో గోడలను కడుతుండటాన్ని తప్పుపట్టింది. మోదీ తాజాగా గరీబీ చుపావ్ (పేదరికాన్ని దాచేయండి) అన్న నినాదాన్ని మోస్తున్నారని, పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఆరోపించింది. డొనాల్డ్ ట్రంప్ పర్యటన పతనమవుతున్న రూపాయి విలువను కాపడలేదని, కడుతున్న గోడల వెనుకనున్న పేదరికాన్ని రూపుమాపలేదని ఆరోపించింది.
ఇండియాకు స్వాతంత్ర్యం రావడానికి ముందు, బ్రిటన్ రాణి ఇండియాను సందర్శించిన సమయంలో చేసిన ఏర్పాట్లనే ఇప్పుడు ట్రంప్ కోసం మోదీ చేస్తున్నారని నిప్పులు చెరిగింది. భారతీయుల సొమ్మును ఇలా వృథా కార్యక్రమాలకు వెచ్చించడం బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడింది. పేదల గుడిసెలు తమ అధ్యక్షుడికి కనిపించకుండా ఉండేందుకు అమెరికా ఏమైనా నిధులు కేటాయించిందా? అని 'సామ్నా' ప్రశ్నించింది. కేవలం 3 గంటల ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన నిమిత్తం రూ. 100 కోట్లు ఖర్చు చేయడం ఏంటని విమర్శించింది.