BCCI: త్వరలోనే బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంపిక.. బరిలో నలుగురు!
- చీఫ్ సెలెక్టర్ పదవీకాలం పూర్తిచేసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్
- త్వరలో ఇంటర్వ్యూలు
- అనుభవజ్ఞుడినే చీఫ్ సెలెక్టర్ పదవి వరిస్తుందన్న గంగూలీ!
ఇప్పటివరకు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా వ్యవహరించిన ఎమ్మెస్కే ప్రసాద్, సెలెక్టర్ గగన్ ఖోడాల పదవీకాలం పూర్తయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి స్థానంలో కొత్తగా చీఫ్ సెలెక్టర్ ను, సెలెక్టర్ ను బీసీసీఐ ఎంపిక చేయనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రెండు స్థానాల కోసం నలుగురు అభ్యర్థులు తుది రేసులో నిలిచారు. పలు దశల్లో వడపోతల అనంతరం వెంకటేశ్ ప్రసాద్, అజిత్ అగార్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, రాజేశ్ చౌహాన్ లు బరిలో మిగిలారు.
ఈ నలుగురికి త్వరలోనే మదన్ లాల్, సులక్షణ నాయక్, ఆర్పీ సింగ్ లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. కమిటీ ఆ నలుగురిలో ఇద్దరిని ఎంపిక చేయనుంది. ఆ ఇద్దరిలో ఒకరు చీఫ్ సెలెక్టర్ గా వ్యవహరిస్తారు. అత్యంత అనుభవజ్ఞుడినే చీఫ్ సెలెక్టర్ పదవి వరిస్తుందని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ సూచనప్రాయంగా వెల్లడించాడు.