Modi: మోదీ ప్రారంభించిన రైలులో దేవుళ్లకు బెర్త్ రిజర్వేషన్.. ఇదేంటంటూ అసదుద్దీన్ ట్వీట్!
- కాశీ–మహాకాళ్ ఎక్స్ ప్రెస్ ను ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన మోదీ
- ట్రైన్ లోని బీ5 బోగీలో 64 నంబర్ బెర్త్ ను చిన్న గుడిలా మార్చేసిన రైల్వే
- ఆ బోగీని ఎప్పటికీ దేవుడి కోసం అలా ఉంచేస్తామన్న అధికారులు
- ఆధ్యాత్మిక సంగీతం, పూర్తిగా వెజిటేరియన్ భోజనాలే ఇవ్వాలని ఆలోచన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించిన కాశీ–మహాకాళ్ ఎక్స్ ప్రెస్ (వారణాసి, ఇండోర్ మధ్య నడిచేది) లోని ఒక బెర్త్ ను చిన్న గుడిలా మార్చేయడం సంచలనంగా మారింది. ట్రైన్ లోని ఈ బెర్త్ ను శాశ్వతంగా దేవుళ్లకు రిజర్వు చేసినట్టు అధికారులు పేర్కొనడం ఆసక్తిగా మారింది. ఆదివారమే ఇదంతా జరిగినా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం చేసిన ట్వీట్ తో వైరల్ గా మారింది. అసదుద్దీన్ ఆ ట్రైన్ లో ఏర్పాటు చేసిన గుడి ఫొటోలను, దానిపై వచ్చిన ఏజెన్సీ వార్తను, రాజ్యాంగంలోని ప్రియాంబుల్ (ప్రవేశిక) ఫొటోను జత చేసి.. ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
B5 బోగీలో గుడి..
రెండు రాష్ట్రాల్లోని మూడు పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రయాణించే కాశీ–మహాకాళ్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్, ఉత్తర ప్రదేశ్ లోని మహా కాళేశ్వర్ (ఉజ్జయని), కాశీ విశ్వనాథ్ (వారణాసి) జ్యోతిర్లింగాలను ఈ ట్రైన్ రూట్ కలుపుతుంది. ఈ ట్రైన్ లోని బీ5 బోగీలో ఉన్న 64వ నంబర్ అప్పర్ బెర్త్ ను చిన్న గుడిలా మార్చారు. రంగులు వేసి, అందంగా అలంకరించారు. అందులో శివుడు, ఇతర దేవుళ్ల ఫొటోలు పెట్టారు.పర్మినెంట్ గా దేవుడికి రిజర్వు
ట్రైన్ ను ప్రారంభించిన సందర్భంగా బెర్త్ లో ఏర్పాటు చేసిన గుడి వద్ద రైల్వే సిబ్బందిపూజలు చేశారు. ఈ సీటును ఇట్లాగే దేవుడికి రిజర్వ్ చేసి ఉంచుతామని రైల్వే అధికారి
దీపక్ కుమార్ తెలిపారు. గురువారం నుంచి ఈ ట్రైన్ సర్వీస్ అందుబాటులోకి రానుంది.
పూర్తిగా ఏసీతో ఉండే ఈ రైలు వారానికి మూడు రోజులు నడుస్తుంది. ఈ రైల్లో ఆధ్యాత్మిక
సంగీతం, పాటలు వినిపించాలని.. పూర్తిగా వెజిటేరియన్ భోజనాలు మాత్రమే
అందుబాటులో ఉంచాలని భావిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.