Karnataka: భర్తను, అతని బంధువులను ఎవరినీ వదలొద్దని లేఖ రాసి.. ఆత్మహత్య చేసుకున్న కన్నడ గాయని
- కన్నడ వినోద రంగంలో విషాదం
- సినీ, టీవీ గాయని సుస్మిత బలవన్మరణం
- కుటుంబ కలహాలే కారణమంటున్న సుస్మిత కుటుంబీకులు
కన్నడ వినోద రంగంలో విషాదం చోటుచేసుకుంది. సినిమాల్లో, టీవీ సీరియళ్లలో గాత్రం అందిస్తూ సింగర్ గా ఎదుగుతున్న సుస్మిత బలవన్మరణం చెందింది. ఆమె ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. బెంగళూరులో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్న శరత్ అనే యువకుడితో సుస్మితకు ఏడాది కిందట వివాహం జరిగింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నాటి నుంచి వారి కాపురం సజావుగా సాగింది లేదు. దాంతో ఆమె భర్త నుంచి విడిపోయి బెంగళూరులోనే తన పుట్టింటికి చేరింది. జరుగుతున్న పరిణామాల పట్ల కలత చెందిన సుస్మిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సూసైడ్ నోట్ రాసిన సుస్మిత దాన్ని తన తల్లికి వాట్సాప్ ద్వారా పంపింది. శరత్ ను, అతని తరఫు వాళ్లను ఎవరినీ వదలొద్దని పేర్కొంది. అత్తవారింట చనిపోవడం కంటే తాను పుట్టిపెరిగిన ఇంట్లోనే చనిపోవాలని భావించానని సుస్మిత అందులో రాసింది. కారణం లేకుండా కొట్టడం, అందరిముందు తిట్టడం వంటి చర్యలతో బాధించారని ఆరోపించింది. అత్తింటివారి ఆగడాల గురించి భర్తకు చెప్పినా అతను కూడా వారికే వంతపాడేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా, తమ కుమార్తె ఆత్మహత్యపై సుస్మిత తల్లిదండ్రులు బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో హాళుతుప్ప, శ్రీసామాన్య అనే సినిమాల్లో పాటలు పాడిన సుస్మిత, అనేక సీరియళ్లలోనూ గాత్రమాధుర్యాన్ని పంచింది.