Varla Ramaiah: మీ దుంపతెగ... ఇప్పటిదాకా గాడిదలు కాశారా?: వర్ల రామయ్య
- వైసీపీ ప్రభుత్వంపై వర్ల రామయ్య ధ్వజం
- సీఎం జగన్ లక్ష్యంగా విసుర్లు
- జగన్ చర్చకు రాలేకపోతే బుగ్గననైనా పంపించాలని డిమాండ్
చంద్రబాబుకు అవినీతి మకిలి అంటించడంలో విఫలమై, కిందపడ్డా పైచేయి తమదే అని నిరూపించుకునేందుకు ఓ పాత వార్తను తీసుకువచ్చారని వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు అంశంలో రూ.150 కోట్లు అంటూ రాశారని, ఆ రూ.150 కోట్లు ఎలా వచ్చాయో నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు. మీరు పోలవరం ప్రాజెక్టు పనులు ఇచ్చినవాళ్లదే ఈ డబ్బు అని నేనంటున్నా. సీజ్ చేసిన రూ.150 కోట్లు డబ్బు మీకే ముట్టిందని నేనంటున్నా. కాదనే ధైర్యముందా మీకు? అయినా మీరెప్పుడు నిజాలు చెప్పారు సార్?' అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు.
"కోర్టులో నిజాలు చెప్పారా? సీబీఐ మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు నిజాలు చెప్పారా? రిమాండ్ కు పంపినప్పుడు నిజాలు చెప్పారా? కోర్టుకు ప్రతి శుక్రవారం వెళ్లినప్పుడు నిజాలు చెప్పారా... ఇప్పుడు చెప్పడానికి! చంద్రబాబునాయుడు డబ్బులు దండుకునే వ్యక్తి కాదు. పెద్ద నోట్లు అవినీతికి కారణమవుతున్నాయని రూ.2 వేల నోటు, రూ.500 నోటు రద్దు చేయాలని కోరిన వ్యక్తి చంద్రబాబు. నీలాంటి వాళ్లు దోచుకుని, దాచుకుని ఆ డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారని పెద్ద నోట్లు రద్దు చేయమన్నారు. ఎన్నికల్లో మీరు గెలిచిన విధానం చూసి టీడీపీ భయపడిపోయిందన్నారు. మీరు డబ్బులు పంచిన విధానం చూసి భయపడ్డామా? ఏ ఏ కంపెనీలను బెదిరిస్తే, బలవంతం చేస్తే అంత డబ్బు వచ్చింది? చెప్పే ధైర్యం ఉందా?
మీరా అవినీతి గురించి మాట్లాడేది? నా సవాల్ కు మీరు రాలేకపోతే ఆ బుగ్గననో, మరెవర్నైనా పంపించండి. వైఎస్సార్ ముఖ్యమంత్రి కాకముందు జగన్ కుటుంబం ఆస్తులెంత, వారు కట్టిన ఇన్ కమ్ ట్యాక్స్ ఎంత, వారు ఏ ఇంట్లో ఉన్నారు... వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ కట్టిన ఇన్ కమ్ ట్యాక్స్ ఎంత, ఈయన కట్టిన ఇళ్లు, వాటి బాగోతమేంటి, ఈయన ఆస్తుల విలువేంటి అని ఒకటే ప్రశ్న వస్తే బుగ్గన కుర్చీలోంచి ఢమాల్ మని కిందపడిపోరా!" అంటూ వ్యాఖ్యానించారు.
"ఏ పని చేసి ఇంత ఆస్తులు సంపాదించారు, ఏ కంపెనీలో పనిచేసి సంపాదించారు. ఎక్కడినుంచి వచ్చాయి ఇన్ని ఆస్తులు అంటే క్విడ్ ప్రో కో అని చెప్పాలి. వీళ్ల నాన్న గారు కొంతమందికి మేలు చేస్తారు. వాళ్లు అబ్బాయి గారి కంపెనీలో పెట్టుబడులు పెడతారు" అంటూ వివరించారు.
"సాక్షి చానల్ లోనే చర్చ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం. పెద్దమనిషిగా తుర్లపాటి కుటుంబరావు, తెలకపల్లి రవి వంటి సీనియర్ పాత్రికేయుడ్ని పిలుచుకుందాం. చంద్రబాబు గారికి ఈ ఆస్తులు ఎలా వచ్చాయో నేను చెబుతా. జగన్ కు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో మీరు చెప్పాలి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారూ! సమయం ఫిక్స్ చేసి చెప్పండి వచ్చేస్తా. ఎప్పుడో పోయిన సంవత్సరం నవంబరు 11న జరిగిన రైడ్ గురించి ఇప్పుడు తీసుకువస్తారా మీ దుంపతెగ! ఇప్పటిదాకా గాడిదలు కాస్తున్నారా!" అంటూ నిప్పులు చెరిగారు.