Nirbhaya: అన్ని అస్త్రాలు అయిపోవడంతో నిర్భయ దోషి వినయ్ శర్మ కొత్త ఎత్తుగడ!
- జైల్లో నిరాహర దీక్ష చేపట్టిన వినయ్ శర్మ
- జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన కోర్టు
- వినయ్ శర్మ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడన్న న్యాయవాది
- ఉరి తీయడం కష్టమని వెల్లడి
నిర్భయ కేసులో తమకు ఉరి తప్పదని తేలిన తర్వాత దోషులు నలుగురు ఎక్కడ ఎలాంటి అవకాశం దొరికినా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వారి ఉరిశిక్ష రెండు సార్లు వాయిదాపడగా, ట్రయల్ కోర్టు మరోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. మార్చి 3న నలుగురినీ ఒకేసారి ఉరితీయాలని పేర్కొంది. ఈ సందర్భంగా కోర్టులో జరిగిన విచారణ ఆసక్తికరంగా సాగింది.
నిర్భయ దోషి వినయ్ శర్మ నిరాహార దీక్ష చేపట్టినట్టు జైలు వర్గాలు కోర్టుకు తెలిపాయి. వినయ్ శర్మ ఆహారం తీసుకోవడం లేదని వెల్లడించాయి. దాంతో, వినయ్ శర్మ పట్ల చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు తీహార్ జైలు అధికారులకు స్పష్టం చేసింది. వినయ్ శర్మ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, వినయ్ శర్మ మానసిక వ్యాధికి గురయ్యాడని, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి ఉరి అమలు చేయడం కష్టమని తెలిపారు.
వినయ్ శర్మ నిరాహార దీక్షకు దిగడం వెనుక బలమైన కారణమే ఉంది. ఇప్పటికే అతను న్యాయపరమైన అవకాశాలన్నీ ఉపయోగించుకున్నాడు. అన్నింట్లోనూ అతనికి వ్యతిరేక ఫలితమే వచ్చింది. ఇక వేరే మార్గం లేక చివరి అస్త్రంగానే నిరాహార దీక్షకు దిగినట్టు అర్థమవుతోంది.
ఇదిలావుంటే, ఇతర దోషులు కూడా ఉరిని తప్పించుకునేందుకు మరోసారి ప్రయత్నాలకు తెరలేపారు. అక్షయ్ ఠాకూర్ మరోసారి రాష్ట్రపతి క్షమాభిక్ష కోరాలని నిర్ణయించుకున్నాడు. పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నాడు. పవన్ గుప్తా కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష కోరే అవకాశాలు ఉన్నాయి.