Google: భారత్ లో 'గూగుల్ స్టేషన్' సేవలకు స్వస్తిపలకాలని గూగుల్ నిర్ణయం
- రైల్వేస్టేషన్లలో ఉచితంగా వైఫై అందించాలనుకున్న గూగుల్
- ఐదేళ్ల కిందట గూగుల్ స్టేషన్ పేరిట ఉచిత వైఫై సేవలు ప్రారంభం
- భారత్ లో దిగివచ్చిన డేటా ధరలు
- గూగుల్ స్టేషన్ కొనసాగించడం అనవసరం అని భావిస్తున్న గూగుల్
కొన్నాళ్ల కిందట భారత్ లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఉచితంగా ఇంటర్నెట్ అందించేందుకు గూగుల్ సంస్థ 'గూగుల్ స్టేషన్' పేరిట ఉచిత వైఫై తీసుకువచ్చింది. అయితే భారత్ లో ఇంటర్నెట్ ధరలు చాలా చవకగా ఉన్న నేపథ్యంలో ఉచితంగా వైఫై అందించడంలో అర్థంలేదని గూగుల్ భావిస్తోంది. అందుకే రైల్వే స్టేషన్ ల్లో 'గూగుల్ స్టేషన్' సేవలు తొలగించాలని నిర్ణయం తీసుకుంది.
గూగుల్ ఐదేళ్ల కిందట భారత్ తో పాటు అనేక దేశాల్లో 'గూగుల్ స్టేషన్' సేవలు ప్రారంభించింది. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు డేటా ప్లాన్లు అందరికీ అందుబాటులో ఉంటున్నాయని, ముఖ్యంగా భారత్ లో ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలో డేటా లభ్యమవుతోందని గూగుల్ వర్గాలంటున్నాయి. భారత్ లో సగటున ఓ యూజర్ నెలకు 10 జీబీ డేటా వినియోగిస్తున్నాడని ట్రాయ్ గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో, గూగుల్ స్టేషన్ ను ఇంకా కొనసాగించడం అనవసరమని భావిస్తున్నట్టు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ గుప్తా అభిప్రాయపడ్డారు.