Venkatesh Prasad: అగార్కరా? వెంకటేశ్ ప్రసాదా?... కొత్త సెలక్టర్ ఎవరు?
- కొత్త సెలక్టర్ ఎంపికలో నిమగ్నమైన కమిటీ
- చివరి ఇంటర్వ్యూలకు మిగిలిన నలుగురు
- అనుభవజ్ఞుడిని ఎంపిక చేస్తామన్న గంగూలీ
- ప్రధాన పోటీ అగార్కర్, ప్రసాద్ ల మధ్యే
భారత క్రికెట్ జట్టుకు కొత్త సెలక్టర్ వచ్చే సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్ గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడాల పదవీ కాలం ఇప్పటికే ముగిసిందన్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త సెలక్టర్ ను ఎంపిక చేసే బాధ్యతను ఆర్పీ సింగ్, మదన్ లాల్, సులక్షణ నాయక్ లతో కూడిన కమిటీకి బీసీసీఐ అప్పగించింది. నియామకానికి ఎటువంటి కాల పరిమితినీ పెట్టలేదు.
కాగా, కొత్త సెలక్టర్ నియామకం మార్చి తొలివారంలోపు జరుగుతుందని మదన్ లాల్ వెల్లడించారు. తుది దశ ఇంటర్వ్యూలకు నలుగురు మిగిలారని అన్నారు. మాజీ పేస్ బౌలర్లు అజిత్ అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్ లతో పాటు లెగ్ స్నిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, రాజేశ్ చౌహాన్ లను ఈ కమిటీ ఇంటర్వ్యూ చేయనుంది. ఇదిలావుండగా, అత్యంత అనుభవజ్ఞుడిని మాత్రమే ఎంపిక చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ పదవికి ప్రధానంగా అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్ మధ్యే పోటీ ఉంటుందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి. టెస్టుల్లో వెంకటేశ్ ప్రసాద్, వన్డేల్లో అజిత్ అగార్కర్ లు ఎక్కువ మ్యాచ్ లను ఆడారు. టెస్టుల అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే వెంకటేశ్ ప్రసాద్ కు, ఇంటర్నేషనల్ టీ-20ల అనుభవం కూడా పరిశీలిస్తే అగార్కర్ కు అవకాశాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఇక వీరిద్దరిలో ఎవరు కొత్త సెలక్టర్ అవుతారన్నది తెలియాలంటే మరో రెండు వారాలు ఆగక తప్పదు.