B.Gopal: 'అందాల ఆడబొమ్మ' పాట కోసం సీతారామశాస్త్రి గారిని చాలా ఇబ్బంది పెట్టాను: దర్శకుడు బి.గోపాల్
- మణిశర్మ ట్యూన్ కట్టారు
- సీతారామశాస్త్రిగారు 18 పల్లవులు రాశారు
- చివరి పల్లవి నచ్చిందన్న బి.గోపాల్
దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించిన చిత్రాలలో 'సమరసింహా రెడ్డి' స్థానం ప్రత్యేకం. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆ సినిమాను గురించి ప్రస్తావించారు. 'అందాల ఆడబొమ్మా' పాటకి మణిశర్మగారు ట్యూన్ చేశారు. ఆ ట్యూన్ కి సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఐదు పల్లవులు రాశారు. 'ఇంకా కావాలి సార్' అంటే మరో అయిదు పల్లవులు రాసి వినిపించారు. అయినా 'ఇంకా కావాలి సార్' అని అన్నాను.
ఆయన మహానుభావుడు .. ఎంత మాత్రం విసుక్కోకుండా, మణిశర్మగారి రికార్డింగ్ థియేటర్లోనే వుండి రాస్తున్నారు. 'మరుసటి రోజుకి ఇవ్వండి .. నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను' అని చెప్పాను. అలాగే మరుసటి రోజు ఉదయాన్నే ఆయన ఇంటికి వెళితే, మంచి కాఫీ తెప్పించారు. తను కొత్తగా రాసిన మరో ఐదు పల్లవులు వినిపించారు .. నాకు నచ్చలేదు. మరో మూడు పల్లవులు రాశారు .. అవి కూడా నచ్చలేదు. చివరిగా ఒక్కటంటే ఒక్కటి రాయండి సార్ .. అది నచ్చకపోతే, రాసిన వాటిల్లో నుంచే ఒకటి సెలెక్ట్ చేద్దాం' అన్నాను. అప్పుడు ఆయన రాసిన పల్లవే 'అందాల ఆడబొమ్మా'. ఆ పాట ఎంతగా పాప్యులర్ అయిందో మీకు తెలిసిందే' అని చెప్పుకొచ్చారు.