Jagan: జగన్ ను "సీఎం మామయ్యా" అంటూ సంబోధించిన చిన్నారి
- కర్నూలు జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం
- జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురిపించిన జ్యోతిర్మయి అనే విద్యార్థిని
- బాలిక ప్రసంగానికి ముగ్ధుడైన సీఎం
కర్నూలులో సీఎం జగన్ వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి వేదికపై సీఎంను మామయ్యా అని సంబోధించగా, అక్కడే ఉన్న సీఎం మురిసిపోయారు. కర్నూలులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదివే జ్యోతిర్మయి వేదికపై కంటి వెలుగు కార్యక్రమం గురించి, ప్రభుత్వ పథకాల గురించి, సీఎం జగన్ పనితీరు గురించి అనర్గళంగా ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా అమ్మఒడి పథకం గురించి చెబుతూ, ఈ పథకంతో చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది. ఇంత మంచి పనిచేసిన సీఎం మామయ్యకు ధన్యవాదాలు అంటూ ఆ బాలిక సభాముఖంగా చెప్పడంతో జగన్ సంతోషం వ్యక్తం చేశారు.
అంతేకాదు, దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపైనా జ్యోతిర్మయి స్పందిస్తూ, ఆడవాళ్లందరికీ రక్షణ కల్పించేలా సీఎం మామయ్య చర్యలు తీసుకుంటున్నారని, ఒక సోదరుడిలా, తండ్రిలా, మామయ్యలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని పొగడ్తల జల్లు కురిపించింది. జ్యోతిర్మయి ప్రసంగించిన తీరుకు జగన్ ముగ్ధుడయ్యారు. వెంటనే ఆ చిన్నారిని దగ్గరికి పిలిచి మనస్ఫూర్తిగా అభినందించారు.