Arjun Tendulker: ముంబయి జట్టులో స్థానం సంపాదించిన సచిన్ తనయుడు
- సీకే నాయుడు ట్రోఫీ కోసం ముంబయి జట్టు ఎంపిక
- ఆల్ రౌండర్ కోటాలో ఎంపికైన అర్జున్ టెండూల్కర్
- జట్టులో చోటు దక్కించుకున్న వరల్డ్ కప్ సంచలనం యశస్వి జైస్వాల్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి బాటలోనే క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సీకే నాయుడు ట్రోఫీలో పాల్గొనే ముంబయి జట్టులో అర్జున్ ఆల్ రౌండర్ కోటాలో స్థానం దక్కించుకున్నాడు. రెండేళ్ల క్రితం ముంబయి అండర్-19 జట్టులో ఎంట్రీ ఇచ్చిన అర్జున్ తొలినాళ్లలో పెద్దగా రాణించలేదు. ప్రధానంగా ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్ ఇంగ్లాండ్ లో కూడా శిక్షణ పొందాడు. టీమిండియా జూనియర్ టీమ్ ల తరఫున విదేశాల్లో ఆడినా గుర్తింపు దక్కలేదు.
నిలకడలేమి అర్జున్ కు ప్రధాన సమస్య. అడపాదడపా మెరుపులు తప్ప సంచలనాత్మక రీతిలో ఒక్క స్పెల్, ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా లేకపోవడం సచిన్ తనయుడి పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారింది. కాగా, సీకే నాయుడు ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ముంబయి జట్టులో యువ సంచలనం యశస్వి జైస్వాల్ కు కూడా చోటు లభించింది. జైస్వాల్ ఇటీవలే ముగిసిన అండర్-19 వరల్డ్ కప్ లో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు బాదాడు.