Vijayashanti: నేను పోషించిన పాత్రను సాకారం చేసేలా సుప్రీం కోర్టు తీర్పు ఉంది: విజయశాంతి
- సైన్యంలో కమాండింగ్ పోస్టులు ఇవ్వాలంటూ మహిళల డిమాండ్
- మహిళా సైనికులకూ శాశ్వత కమిషన్ వర్తింపజేయాలన్న సుప్రీంకోర్టు
- సుప్రీం తీర్పును స్వాగతించిన విజయశాంతి
సైన్యంలో తమకు కూడా కమాండింగ్ పోస్టులు ఇవ్వాలని మహిళా సైనికులు ఎప్పటినుంచో పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక రీతిలో స్పందిస్తూ, మహిళలను కూడా సైన్యంలో శాశ్వత కమిషన్ ప్రాతిపదికన కమాండింగ్ పోస్టుల్లో నియమించాలని తీర్పు వెలువరించింది. ఈ అంశంలో ప్రముఖ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు.
20 ఏళ్ల కిందట తాను 'భారతరత్న' అనే చిత్రంలో ఆర్మీ కమాండర్ పాత్ర పోషించానని, సుప్రీం కోర్టు తీర్పు ఇప్పుడా పాత్రను వాస్తవరూపంలోకి తెచ్చేలా ఉందని పేర్కొన్నారు. నాడు తాను ఆర్మీ ఆఫీసర్ గా కన్న కలను సుప్రీం కోర్టు తన స్ఫూర్తిదాయక తీర్పుతో నిజం చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారని, సైన్యానికి నాయకత్వం వహించి సఫలమవుతారనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయశాంతి ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.