Undavalli Arun Kumar: రాజశేఖర్ రెడ్డి ఇలా ఎప్పుడూ చేయలేదు కానీ, చంద్రబాబు, కేసీఆర్ చేశారు: ఉండవల్లి
- ఏపీలో కొన్ని మీడియా చానళ్ల నిలిపివేత
- వైఎస్ ఎప్పుడూ మీడియా మీదకు వెళ్లలేదని వెల్లడి
- వ్యతిరేక వార్తలకు భయపడితే పతనం ప్రారంభమైనట్టేనని వ్యాఖ్యలు
ఏపీలో రెండు వార్తా చానళ్లపై అప్రకటిత నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక కొన్ని చానళ్లను ఆపేశారంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్సార్ సీఎం అయిన సమయంలో సాక్షి పేపర్, సాక్షి చానల్ లేవని, ఆ సమయంలో మీడియా మొత్తం వైఎస్సార్ కు వ్యతిరేకంగా ఉండేదని వెల్లడించారు. తనపై మీడియా అంత వ్యతిరేకత చూపించినా వైఎస్సార్ ఏనాడూ చానళ్లను, పత్రికలను నిషేధించలేదని, ఫలానా పత్రికలో తనకు వ్యతిరేకంగా రాస్తున్నారని మాత్రం చెప్పేవారని వివరించారు.
"రాజశేఖర్ రెడ్డి ఏనాడూ మీడియా మీదికి వెళ్లలేదు. ఏ మీడియాను ఆపుచేయాలని ప్రయత్నించలేదు. ఈనాడులో ఇలా రాస్తారయా, ఆ రెండు పేపర్లు ఇంతేనని డైరెక్ట్ గా చెప్పేవాడు తప్ప, ఎవరిపైనా చర్యలకు దిగలేదు. ఇప్పుడు రాజమండ్రిలో రెండు చానళ్లు రావడంలేదు. నాకున్న సమాచారం ప్రకారం ప్రభుత్వమే రాష్ట్రం మొత్తం ఆపేయమందట. ఇంతకుముందు కేసీఆర్ ఇలాగే చేశాడు, చంద్రబాబు ఇలాగే చేశాడు. ఆ పని జగన్ మోహన్ రెడ్డికి తెలుసో తెలియదో కానీ, ఇది చాలా తప్పు. మీకు వ్యతిరేకంగా వచ్చే వార్తలకు మీరు భయపడిన మరుక్షణం మీ పతనం ప్రారంభమైనట్టే" అంటూ ఘాటుగా స్పందించారు.