Yogi Adityanath: చావడానికి వచ్చినట్టయితే.. ఎట్లా బతికుంటారు?: సీఏఏ నిరసనకారులపై యూపీ సీఎం యోగి వివాదాస్పద వ్యాఖ్యలు

Yogi Adityanath Controversial Comments On CAA Violence

  • యూపీలో జరిగిన ఆందోళనలో మరణించిన 20 మంది
  • ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తిన ప్రతిపక్షాలు
  • హింసకు పాల్పడే వారికి అలాగే బదులిస్తామని హెచ్చరిక

సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, వాటిలో చనిపోయిన వారిని ఉద్దేశించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు సీఏఏ ఆందోళన అంశాన్ని ప్రస్తావించడంతో ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘ఎవరైనా చనిపోవాలనుకుని వస్తుంటే.. వాళ్లు ఎలా బతికి ఉంటారు (అగర్ కొయి మర్నే కే లియే ఆ హీ రహా హై తో వో జిందా కహా సే హో జాయేగా)’ అని పేర్కొన్నారు. యోగి చేసిన ఈ కామెంట్లపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

కాల్చి చంపడానికి వచ్చారు

ఆందోళనకారులెవరూ పోలీసుల కాల్పుల్లో చనిపోలేదని, నిరసనల్లో పాల్గొన్నవారు కాల్చడంతోనే చనిపోయారని యోగి వ్యాఖ్యానించారు. ప్రజలను కాల్చాలన్న ఉద్దేశంతో కొందరు వీధుల్లోకి వస్తే.. అయితే వాళ్లు చనిపోతారని, లేకపోతే పోలీసులు చనిపోవాల్సి వస్తుందని అన్నారు. ‘‘శాంతియుతంగా నిరసనలు తెలుపుకొంటే సరే. అలా కాకుండా కొందరు ప్రజాస్వామ్యం ముసుగులో హింసకు పాల్పడితే.. మేం కూడా వారి భాష (హింస)లోనే బదులిస్తాం..” అని హెచ్చరించారు.

ఆజాదీ అంటే ఏం చేయాలి?

సీఏఏ ఆందోళనల్లో ఆజాదీ (స్వాతంత్య్రం) అన్న నినాదాలు చేస్తున్నారని యోగి మండిపడ్డారు. ‘‘ఆజాదీ అంటే ఏంటి? పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా కలలు నెరవేర్చేందుకు పనిచేయాలా? లేక మహాత్మా గాంధీ కలలు నెరవేర్చాలా? ఆందోళనలు, హింస పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ప్రశంసించాలి. రాష్ట్రంలో ఆందోళలను అనుమతించేది లేదు..” అని పేర్కొన్నారు. ఆందోళనకారుల ముసుగులో కొందరు హింసను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని యోగి విమర్శించారు.

  • Loading...

More Telugu News