BJP: యూపీ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠిపై రేప్ కేసు నమోదు
- మహిళను బంధించి నెల రోజులపాటు అత్యాచారం
- ఎమ్మెల్యే సహా ఏడుగురిపై కేసు నమోదు
- బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతల సంఖ్య పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, స్వామి చిన్మయానంద ఇప్పటికే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెంగార్ ఇప్పటికే దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా, మరో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠి, ఆయన అనుచరులు ఆరుగురిపై అత్యాచారం కేసు నమోదైంది. వారు తమపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ 40 ఏళ్ల మహిళ చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
2017లో తనను బంధించి నెల రోజులపాటు ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించారని ఆరోపించింది. ఈ నెల 10నే ఆమె ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ రామ్ బదన్‌సింగ్ తెలిపారు. ఆమె ఫిర్యాదుతో ఎమ్మెల్యే సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు చెప్పిన ఎస్పీ.. బాధిత మహిళ స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలిపారు.