Nara Lokesh: మా ఆస్తుల వివరాలు ఇవిగో... వెల్లడించిన నారా లోకేశ్

Nara Lokesh reveals family assets

  • తన పేరిట రూ.8.14 కోట్లు ఉన్నాయన్న లోకేశ్
  • చంద్రబాబు ఆస్తి రూ.9 కోట్లని, అప్పులు రూ.5.13 కోట్లని వెల్లడి
  • గతంతో పోలిస్తే భువనేశ్వరి ఆస్తులు తగ్గాయని చెప్పిన లోకేశ్
  • హెరిటేజ్ కు రాజధానిలో భూములు లేవని స్పష్టీకరణ

తమ కుటుంబ సభ్యుల ఆస్తులపై ఆరోపణలు చేస్తున్నారని, అలా ఆరోపణలు చేసేవాళ్లు ముందు తమ ఆస్తులను ప్రకటించాలని, తాము ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం రావడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆస్తులను ఎవరికి వారే ప్రకటించాలని, సీబీఐ, ఈడీ ప్రకటించడం కాదని సీఎం జగన్ పై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించారు.

తన ఆస్తి రూ.8.14 కోట్లు అని, తన పేరిట ఉన్న షేర్లను అర్ధాంగి బ్రాహ్మణికి గిఫ్టుగా ఇచ్చానని తెలిపారు. మునుపటితో పోలిస్తే తన ఆస్తి రూ.2.40 కోట్లు తగ్గిందని వెల్లడించారు. ఇక తన తండ్రి చంద్రబాబు ఆస్తి గురించి వివరిస్తూ, ఆయన ఆస్తి రూ. 9 కోట్లు అని, అప్పులు రూ.5.13 కోట్లు అని స్పష్టం చేశారు. చంద్రబాబు నికర ఆస్తి రూ.3.87 కోట్లుగా పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే చంద్రబాబు ఆస్తి రూ.87 లక్షల మేర పెరిగిందని చెప్పారు.

తన తల్లి భువనేశ్వరి పేరిట ఉన్న ఆస్తి వివరాలు కూడా లోకేశ్ మీడియాతో పంచుకున్నారు. భువనేశ్వరి ఆస్తులు రూ.50 కోట్లు అని, గతంతో పోలిస్తే ఆమె ఆస్తిలో తగ్గుదల కనిపించిందని వివరించారు. రాజకీయాలపై ఆధారపడకూడదనే హెరిటేజ్ సంస్థను స్థాపించామని, 15 రాష్ట్రాలో హెరిటేజ్ కార్యకలాపాలు సాగిస్తోందని, తద్వారా వేలమందికి ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. హెరిటేజ్ సంస్థకు 9 రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో తమ సంస్థకు ఎలాంటి ఆస్తులు లేవని, రాజధాని పరిధికి ఆవల 30 కిలోమీటర్ల దూరంలో ఆరేళ్ల కిందట భూములు కొన్నామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News