IIT Madras: వాష్ రూమ్ కు వెళ్లిన అమ్మాయిని సెల్ ఫోన్ తో చిత్రీకరించిన కీచక ఉద్యోగి!
- మద్రాస్ ఐఐటీలో ఘటన
- ప్రాజెక్ట్ ఆఫీసర్ శుభమ్ బెనర్జీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని
- అధికారి అరెస్ట్.. సెల్ ఫోన్ స్వాధీనం
మద్రాస్ ఐఐటీలో ఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ తనను వీడియో తీసేందుకు ప్రయత్నించాడంటూ ఓ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. ఆ వ్యక్తి పేరు శుభమ్ బెనర్జీ కాగా, ఆ అమ్మాయి మద్రాస్ ఐఐటీలో పీహెచ్ డీ విద్యార్థిని. శుభమ్ బెనర్జీ మద్రాస్ ఐఐటీలో ఏరోస్పేస్ డిపార్ట్ మెంట్ లో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కాగా, వాష్ రూమ్ కు వెళ్లిన ఓ విద్యార్థిని టాయిలెట్ కు చిన్న హోల్ ఉండడాన్ని గమనించింది. ఆ రంధ్రంలోంచి చూడగా ఎవరో వీడియో తీస్తున్నట్టు గ్రహించింది. సెల్ ఫోన్ తో వీడియో తీస్తున్నది శుభమ్ బెనర్జీ అని గుర్తించి దిగ్భ్రాంతికి గురైంది. ఆ విద్యార్థిని చేపట్టిన ప్రాజెక్టుకు అతనే పర్యవేక్షకుడు కావడం గమనార్హం.
శుభమ్ బెనర్జీ గతంలో వ్యవహరించిన తీరును కూడా బేరీజు వేసుకున్న యువతి అతడి దురాలోచనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో శుభమ్ బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేసి అతడి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో యువతికి సంబంధించిన వీడియో కనిపించలేదు. దాంతో అతడే వాటిని తొలగించి ఉంటాడని భావించి ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.