- దేశం కోసం ఓపికగా ముందుకు వెళ్తున్నా..
- మార్పు కోసం సహనం అవసరం
- యువత ఇంటర్నెట్ లో కాకుండా చుట్టూ చూసి నేర్చుకోవాలని సూచన
దేశానికి సేవ చేయాలన్న తపనతోనే రాజకీయ పార్టీని స్థాపించానని, ప్రజలకు సేవ చేసేందుకే పోరాటాలు కొనసాగిస్తున్నానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. భగత్ సింగ్ లాంటి వారు తనకు ఆదర్శమన్నారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడినా రాజకీయ పోరాటాన్ని ఆపలేదని, లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉన్నానని తెలిపారు. గురువారం ఢిల్లీలోనిర్వహించిన ‘ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్’ సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. యువతలో ఆవేశాన్ని అర్థం చేసుకుని వారితో మాట్లాడానని చెప్పారు.
అధికార రాజకీయాలు చూస్తే విసుగొస్తుంది
తాను చిన్నప్పటి నుంచీ జాతీయ, ప్రాంతీయ రాజకీయాలను చూస్తూ పెరిగానని.. అధికారం కోసం కొందరు చేస్తున్న రాజకీయాలను చూసి విసుగు చెందానని పవన్ కల్యాణ్ చెప్పారు. రాజకీయంగా తనకు ఒకే ఎమ్మెల్యే ఉన్నా, తన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నానని తెలిపారు. కర్నూల్ లో యువతి మృతి విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
మార్పు కోసం ఓపిక పట్టాలి
మార్పు కోసం కొంత ఓపిక పట్టాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే కొన్నేళ్ల పోరాటంతోనే సాధ్యమవుతుందని, వెంటనే కావాలంటే ఏ మార్పూ రాదని వివరించారు. తాను స్వలాభం కోసం, అధికారం కోసం పనిచేయడం లేదని, ఓటములు ఎదురైనా దేశ సేవ కోసం ఓపికగా ముందుకు సాగుతున్నానని తెలిపారు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నా మనమంతా ఒకే దేశం నినాదంతో ఐక్యంగా ఉన్నామని చెప్పారు.