Maha sivaratri: వైభవంగా ప్రారంభమైన శివరాత్రి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
- తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన శివాలయాలు
- ఉదయం నుంచే పోటెత్తిన భక్తులు
- శివనామ స్మరణతో నిండిన ముక్కంటి ఆలయాలు
శివరాత్రి పర్వదినం సందర్భంగా ముక్కంటి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు శివనామ స్మరణలో మునిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం మల్లన్న, వేములవాడ రాజన్న ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున క్యూకట్టారు. శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శ్రీశైలంలో నేటి సాయంత్రం స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించనుండగా, రాత్రి పాగాలంకరణ, లింగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 12 గంటలకు శ్రీభ్రమరాంబదేవి-మల్లికార్జునస్వామి వార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు. శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. మరికాసేపట్లో స్వామి వారికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు మహాలింగార్చన, రాత్రి 11:30 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. ఇక, హన్మకొండ వేయిస్తంభాల ఆలయంలోని రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.