Telangana: తెలంగాణకు రెండు రాజ్యసభ సీట్లు... రెండూ టీఆర్ఎస్ కే... ఒకటి కవితకు ఖరారు!
- రెండో స్థానం కోసం పోటీలో కేకే
- పొంగులేటి, మందా జగన్నాథం, సీతారాం నాయక్ కూడా
- తుది నిర్ణయం కేసీఆర్ చేతుల్లోనే
తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరి రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా, ఆ రెండూ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఏప్రిల్ 9న ఈ సీట్లు ఖాళీ కానుండగా, నిజామాబాద్ నుంచి గత లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్ కుమార్తె కవితకు, ఓ స్థానం ఖరారైనట్టు తెలుస్తోంది. రిటైర్డ్ సభ్యుల జాబితాలో గరికపాటి రామ్మోహనరావు, కేవీపీ ఉండగా, కె.కేశవరావు సీటు కూడా ఖాళీ కానుంది. కేకే సీటు ఏపీ కోటా నుంచి ఖాళీ కానుండగా, ఈ దఫా ఆయన తెలంగాణ నుంచి తనకు రాజ్యసభ స్థానం కావాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర పునర్విభజన సమయంలో కేకే ఏపీ కోటాకు వెళ్లిన సంగతి తెలిసిందే. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నిబంధనల్లో భాగంగా, సభ్యుల పదవీ కాలం పూర్తి కావడానికి 50 రోజుల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి వుండటంతో అతి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందని అంచనా.
కాగా, ప్రస్తుతం రాజ్యసభకు తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యులుండగా, వారిలో టీఆర్ఎస్ కు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. ఇక ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తే, 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీఆర్ఎస్ కు 104 మంది ఎమ్మెల్యేలున్నారన్న సంగతి తెలిసిందే. దీంతో ఖాళీ కానున్న రెండు సీట్లూ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయం. అంటే, రాష్ట్రం తరఫున ఉన్న ఏడు రాజ్యసభ స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ఉంటారు.
ఇక, కవితకు ఓ స్థానం ఖాయమైనట్టు తెలుస్తుండగా, రెండో స్థానాన్ని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మందా జగన్నాథం, ప్రొఫెసర్ సీతారాం నాయక్ లు ఆశిస్తూ, కేకేతో పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశంపై కేసీఆర్ దే తుది నిర్ణయమని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.