Budda Venkanna: బీజేపీతో వైకాపా కలిసిపోతుందని ప్రకటించి విజయసాయిరెడ్డి నాలుక్కరుచుకున్నారు: బుద్ధా వెంకన్న
- ఫెడరల్ ఫ్రంట్ ఫిడేల్ ఫ్రంట్ అయ్యింది
- ఇప్పుడు బీజేపీతో కాళ్ల బేరానికి వెళ్లాడు
- ఎంత ఖర్చైనా ఫర్వాలేదు, ఢిల్లీలోనే ఉంటానంటున్నాడు
- బీజేపీలో కలిసిపోవాల్సిందే అంటున్నాడు తుగ్లక్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 'చంద్రబాబు గారికి అవినీతి మరక అంటించబోయి బీజేపీతో వైకాపా కలిసిపోతుంది అని ట్విట్టర్ ద్వారా ప్రకటించి విజయసాయిరెడ్డి గారు నాలుక్కరుచుకున్నారు' అని ట్వీట్ చేశారు.
'ఫెడరల్ ఫ్రంట్ ఫిడేల్ ఫ్రంట్ అయ్యేసరికి ఇప్పుడు బీజేపీతో కాళ్ల బేరానికి వెళ్లాడు. ఎంత ఖర్చైనా ఫర్వాలేదు, ఢిల్లీలోనే ఉంటా.. బీజేపీలో కలిసిపోవాల్సిందే అంటున్నాడు తుగ్లక్' అని చెప్పారు.
'ఫెడరల్ ఫ్రంట్ లో ఊపేస్తా అన్నాడు. ఉన్న రూ.43 వేల కోట్లలో కొంత ఖర్చు చేసి బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టాడు. ఉప ప్రధాని పదవి నాకే కావాలి అంటూ 2000 వేల కోట్లు ఫెడరల్ ఫ్రంట్ మిత్రులకు సమర్పించుకున్నాడు' అని ఆరోపించారు. 'తీగ లాగితే డొంక కదిలింది. జైలు పిలుస్తుంది "కావాలి తుగ్లక్.. రావాలి తుగ్లక్" అని సిద్ధంగా ఉండండి విజయసాయిరెడ్డి గారు' అని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.