Corona Virus: కరోనాపై పోరాటానికి చైనాకు అపర కుబేరుల చేయూత
- చైనాలో కరోనా మరణమృదంగం
- చైనాకు భారీగా ఆర్థికసాయం ప్రకటించిన బిల్ గేట్స్, జాక్ మా
- 100 మిలియన్ డాలర్లు ఇస్తామన్న గేట్స్
- 14.5 మిలియన్ డాలర్ల సాయం అందించేందుకు జాక్ మా సంసిద్ధత
కరోనా వైరస్ జడలు విప్పిన భూతంలా రెచ్చిపోవడంతో ఆసియా పెద్దన్న చైనా కుదేలైంది. ఓవైపు ప్రజా జీవనం భయం గుప్పిట్లో కొనసాగుతోంది. మరోవైపు ఆర్థిక స్థితి క్రమంగా మందగిస్తోంది. ఇప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి శాంతించకపోవడం చైనాను కలవరపెడుతోంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వనరులు ఖర్చు కావడం తప్ప ప్రయోజనం కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరులు బిల్ గేట్స్, జాక్ మా చైనాకు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు వచ్చారు.
జాక్ మా మొత్తం రూ.14.5 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించారు. ఆయన ఇప్పటికే గత జనవరిలో 10 మిలియన్ డాలర్లు ప్రకటించారు. దాంతో కలుపుకుని తాజా సాయం వర్తిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, జాక్ మాకు చెందిన ఆలీబాబా గ్రూప్ కరోనాపై పోరాటానికి 145 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధి ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. పరిశోధనలకు చేయూతనందిస్తామని హామీ ఇచ్చింది.
అటు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 100 మిలియన్ డాలర్ సాయం ప్రకటించారు. తన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరఫున ఈ సాయం అందించాలని నిర్ణయించారు. కరోనా వైరస్ ను తుదముట్టించే వ్యాక్సిన్ రూపకల్పన కోసం చైనా వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు తయారైనా అవి ఇంకా ప్రయోగదశల్లోనే ఉన్నాయి. అవి అన్ని దశల పరీక్షలను అధిగమించి అందుబాటులోకి వచ్చేసరికి ఏడాది కాలం పడుతుందని అంచనా వేస్తున్నారు.