Bengaluru: కశ్మీర్‌కు విముక్తి కావాల్సిందే: బెంగళూరులో కలకలం రేపిన మరో ‘అమూల్య’
- బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా కన్నడ సంఘాల ప్రదర్శన
- ప్లకార్డులు ప్రదర్శించి కలకలం రేపిన ఆరుద్ర
- అమూల్యకు ఆమె ఫ్రెండేనన్న పోలీసులు
కశ్మీర్‌కు విముక్తి ప్రసాదించాలంటూ బెంగళూరుకు చెందిన ఓ యువతి ప్లకార్డులు ప్రదర్శించడం కలకలం రేపింది. నగరంలోని టౌన్‌హాల్‌లో వివిధ కన్నడ సంఘాల ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్న ఆరుద్ర అనే యువతి.. కశ్మీర్‌కు, దళితులకు, బహుజనులకు, ఆదివాసీలకు, ముస్లింలకు విముక్తి కావాలని రాసివున్న ప్లకార్డు ప్రదర్శించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని సంపంగి రామనగర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సీఏఏకు వ్యతిరేకంగా మొన్న నగరంలో నిర్వహించిన ర్యాలీలో మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడిన తర్వాత స్టేజిపైకి వచ్చిన అమూల్య లియోనా అనే యువతి ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినదించింది. దీంతో అప్రమత్తమైన ఒవైసీ వెంటనే ఆమె వద్దకు వెళ్లి మైక్ లాక్కున్నారు. అమూల్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే ఆరుద్ర.. కశ్మీర్‌కు విముక్తి ప్రసాదించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం. ఆరుద్రను అరెస్ట్ చేసిన పోలీసులు.. అమూల్యకు ఆమె ఫేస్‌బుక్ ఫ్రెండ్ అని తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.