TTD: అజిత్ దోవల్ పేరిట నకిలీ ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ

TTD complains Tirupathi police
  • టీటీడీ నిధులు రాష్ట్ర ఖజానాకు మళ్లిస్తున్నారంటూ ప్రచారం
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ వర్గాలు
  • తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • ఇలాంటి ప్రచారం దారుణమన్న వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి రూ.2,300 కోట్లు రాష్ట్ర ఖజానాకు తరలిస్తున్నట్టు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరిట సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. దీనిపై టీటీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై టీటీడీ వర్గాలు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. అజిత్ దోవల్ పేరిట జరుగుతున్న నకిలీ ప్రచారంపై నిగ్గు తేల్చాలని తమ ఫిర్యాదులో కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. దేవుడి సొమ్మును ఇష్టం వచ్చినట్టు వాడడానికి లేదని, భక్తుల కోసం మాత్రమే ఆ సొమ్ము వినియోగించాల్సి ఉంటుందని అన్నారు. ఇలాంటి వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. టీటీడీ వ్యవహారాల కోసం త్వరలోనే సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
TTD
Andhra Pradesh
Ajith Doval
Social Media
Police

More Telugu News