CAA: యూపీలోని అలీగఢ్ లో ఉద్రిక్తంగా మారిన సీఏఏ ఆందోళనలు.. ఇంటర్నెట్ బంద్.. భారీగా పోలీసుల మోహరింపు
- రాళ్ల దాడులకు దిగిన ఆందోళనకారులు.. పోలీసుల లాఠీ చార్జి
- ఒక షాపు, పోలీసుల వాహనం దహనం
- భారీగా మోహరించిన పారా మిలటరీ బలగాలు
ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ లో సుమారు నెల రోజులుగా ప్రశాంతంగా జరుగుతున్న యాంటీ సీఏఏ ఆందోళనలు ఆదివారం హింసాత్మకంగా మారాయి. ఆందోళన కారులు, పోలీసుల మధ్య గొడవజరిగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీనిపై ఆగ్రహించిన ఆందోళనకారులు ఒక దుకాణానికి, పోలీసుల వాహనానికి నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడం, పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గుమిగూడుతుండటంతో పోలీసులు ఆంక్షలు విధించారు. మొబైల్ ఇంటర్నెట్ ను ఆపివేయించారు. పారా మిలటరీ బలగాలైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించారు.