Virat Kohli: బయటి వ్యక్తుల్లా ఆలోచిస్తే నేనూ బయటే ఉండేవాడిని: కోహ్లీ
- ఓటమిపై ప్రజల స్పందన గురించి ఎక్కువగా ఆలోచించను
- నేనెలా బ్యాటింగ్ చేస్తానో నా స్కోర్లు తెలుపవు
- మూడు, నాలుగు ఇన్నింగ్స్ ల్లో ఫెయిలైతే ఆందోళన చెందను
న్యూజిలాండ్ తో తొలి టెస్టులో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఈ పరాజయంపై ప్రజల స్పందన గురించి తాను అతిగా ఆలోచించనని కోహ్లీ చెబుతున్నాడు. ‘నేను వేరే విషయాల గురించి పట్టించుకోకుండా సానుకూల దృక్పథంతో ఉండాలనుకుంటున్నా. ఒక్క ఇన్నింగ్స్ తర్వాత బయట మాపై అభిప్రాయం ఎలా మారుతుందో నాకు తెలుసు. కానీ నేను అలా ఆలోచించను. ఒకవేళ నేను బయటి వ్యక్తుల్లా ఆలోచిస్తే.. ఇప్పుడు నేను కూడా జట్టు నుంచి బయట ఉండేవాడిని’ అని కోహ్లీ పేర్కొన్నాడు.
నేను బాగానే ఆడుతున్నా:
తొలి టెస్టులో ఓటమికి బ్యాట్స్ మెన్ ఘోర వైఫల్యమే కారణం. జట్టు బ్యాటింగ్ కు వెన్నెముక లాంటి కెప్టెన్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ 2, 19 స్కోర్లతో విఫలమయ్యాడు. ఈ మ్యాచే కాదు కివీస్ పర్యటనలో టీ20, వన్డేల్లోనూ కోహ్లీ నిరాశ పరిచాడు. కానీ, తన బ్యాటింగ్ లో ఎలాంటి లోపం లేదని విరాట్ అంటున్నాడు. కొన్నిసార్లు తాను చేసే పరుగులు తన బ్యాటింగ్ విధానాన్ని ప్రతిబింబించవని చెబుతున్నాడు. ‘నేను బాగాగే ఉన్నా. నా బ్యాటింగ్ కూడా బాగుంది. కొన్నిసార్లు మన స్కోర్లు మనం ఏ విధంగా బ్యాటింగ్ చేస్తున్నామో తెలుపవు. కచ్చితంగా రాణించాలని అనుకున్నాక అలా చేయనప్పుడే ఈ పరిస్థితి వస్తుంది. చాలా కాలంగా ఎక్కువ క్రికెట్ ఆడుతున్నప్పుడు 3–4 ఇన్నింగ్స్ లు మనం అనుకున్నట్టు సాగకపోవచ్చు. అయితే దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే మరింత ఇబ్బంది పడుతామ’ని కోహ్లీ చెప్పుకొచ్చాడు.