Donald Trump: భారత పర్యటనలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ రేపటి షెడ్యూల్ వివరాలు
- ఆగ్రా నుంచి ఢిల్లీ చేరుకున్న ట్రంప్ దంపతులు
- రేపు ఉదయం రాష్ట్రపతి, మోదీతో ట్రంప్ భేటీ
- హైదరాబాద్ హౌస్ లో మోదీతో ద్వైపాక్షిక చర్చలు
ఆగ్రా పర్యటన ముగించుకున్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు రాత్రికి ఐటీసీ మౌర్య హోటల్ లో బస చేస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా రేపు ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ట్రంప్ కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీకి రాజ్ ఘాట్ లో ట్రంప్ నివాళులర్పించనున్నారు. అనంతరం, ఉదయం పదకొండు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. హైదరాబాద్ హౌస్ లో మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
రేపు మధ్యాహ్నం 12.40 గంటలకు ద్వైపాక్షిక ఒప్పందాలు, అందుకు సంబంధించిన పరస్పరం పత్రాల మార్పిడి ఉంటుంది. ఆ తర్వాత మోదీ, ట్రంప్ ల అధికారిక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందితో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు సమాచారం. రేపు రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన విందులో ట్రంప్ పాల్గొననున్నారు. రేపు రాత్రి 10 గంటలకు అమెరికాకు ట్రంప్ బృందం తిరిగి వెళ్లనుంది.