- ఆయనను కేంద్ర సర్వీసులకు వెళ్లనివ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం
- కేసులేమైనా ఉంటే చట్ట ప్రకారం వ్యవహరించవచ్చని సూచన
- తుది తీర్పు వెలువరించిన ధర్మాసనం
ఏపీ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) రద్దు చేసింది. ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతినిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణ కిషోర్ పై ఉన్న కేసును ఏపీ ప్రభుత్వం చట్ట ప్రకారం పరిశీలించుకోవచ్చని సూచించింది. దీంతో కృష్ణ కిషోర్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
ఆర్థిక అభివృద్ధి మండలి నిర్ణయాలపై..
కృష్ణ కిషోర్ గతంలో ఏపీ ఆర్థిక అభివృద్ది మండలి సీఈవోగా పనిచేశారు. ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మౌలిక వసతుల శాఖ నుంచి నివేదిక తెప్పించి, కేసు నమోదు చేసి విచారణ జరపాల్సిందిగా సీఐడీ, ఏసీబీలను ఆదేశించింది. దీంతో కృష్ణ కిషోర్ ఏపీ ఆర్థిక మండలి చట్టాన్ని ఉల్లంఘించారని, ప్రభుత్వ అనుమతి లేకుండా కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారని పేర్కొంటూ కేసులు నమోదయ్యాయి.
కేంద్ర సర్వీసులకు వెళ్లనివ్వాలి..
అయితే ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడంపై కృష్ణ కిషోర్ క్యాట్ లో పిటిషన్ వేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న క్యాట్ ధర్మాసనం మంగళవారం తుది తీర్పు వెలువరించింది. కృష్ణ కిషోర్ సస్పెన్షన్ సరికాదని, ఆయనను కేంద్ర సర్వీసులకు వెళ్లనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.