Ajit Pai: భారత గడ్డపై అడుగుపెట్టగానే భావోద్వేగాలకు లోనైన ట్రంప్ బృంద సభ్యుడు
- ట్రంప్ తో పాటు భారత్ వచ్చిన కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ అజిత్
- అజిత్ తండ్రి హైదరాబాదీ, తల్లిది బెంగళూరు
- తల్లిదండ్రులకు భారత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అజిత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు భారీస్థాయిలో అధికార బృందం కూడా భారత్ లో పర్యటిస్తోంది. వారిలో ఒకరు అజిత్ పాయ్. ఆయన అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అజిత్ ఓ భారతీయ అమెరికన్. ఆయన తల్లిదండ్రులు కేవలం 8 డాలర్లతో అమెరికా వెళ్లి అక్కడే కష్టపడి పైకెదిగారు. వారి తనయుడు అజిత్ ఏకంగా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ కు అధిపతి అయ్యాడు. ఈ పదవి చేపట్టిన తొలి భారతీయ అమెరికన్ గా ఖ్యాతి పొందాడు.
అయితే, ట్రంప్ వెంట భారత్ వచ్చిన అజిత్ తన తల్లిదండ్రులకు భారత గడ్డతో ఉన్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని భావోద్వేగాలకు లోనయ్యారు. తన అభ్యున్నతి కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమించారని, ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేసుకున్నారు. అజిత్ తండ్రి హైదరాబాద్ కు చెందినవాడు కాగా, తల్లి స్వస్థలం బెంగళూరు. వారు 70వ దశకం ఆరంభంలో అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.