Arvind Kejriwal: బయటి శక్తులు నగరంలోకి రాకుండా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల మూసివేత!: కేజ్రీవాల్
- బయటి వ్యక్తులు నగరంలోకి రాకుండా ఆంక్షలు
- హింసను అడ్డుకునేందుకు సీఎం కేజ్రీవాల్ చర్యలు
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ
- అదనపు బలగాలు మోహరించాలని కేంద్రం నిర్ణయం
సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణతో ఢిల్లీలో చెలరేగిన హింసను అణచివేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బయటి నుంచి విద్రోహ శక్తులు దేశ రాజధానిలోకి వచ్చి హింసకు పాల్పడుతున్నాయని గుర్తించిన సీఏం, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలను కొంతకాలం మూసివేయాలని భావిస్తున్నారు.
అలాగే, సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రం అదనపు బలగాలను మోహరించనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కేజ్రీవాల్ తెలిపారు. అల్లర్లను తగ్గించి రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారని చెప్పారు. ఈశాన్య ఢిల్లీలో సోమవారం చెలరేగిన హింసలో ఓ పోలీస్ కానిస్టేబుల్ సహా ఏడుగురు చనిపోగా.. దాదాపు వంద మంది గాయపడిన సంగతి తెలిసిందే.
అయితే, ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు హింసను అడ్డుకోలేకపోయారని సీఎం చెప్పారు. ఈ మేరకు తనకు నివేదిక వచ్చిందని చెప్పారు. పై నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో ఆందోళనకారులపైకి బాష్పవాయువు ప్రయోగించాలో, లాఠీచార్చి చేయాలో పోలీసులు తేల్చుకోలేకపోయారని చెప్పారు. ఇదే విషయాన్ని తాను అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని అరవింద్ తెలిపారు.
అన్ని పార్టీల నేతలతో భేటీ
ఢిల్లీలో హింసను నిర్మూలించి శాంతి నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేజ్రీవాల్ అన్ని పార్టీల నేతలతో భేటీ అయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్లే హింసకు పాల్పడుతున్నారన్న విషయం నేతలు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. దాంతో ఢిల్లీ సరిహద్దును కొంతకాలం మూసివేయాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.