Donald Trump: వచ్చే ఎన్నికల్లో నేను గెలిస్తే మార్కెట్లకు పట్టపగ్గాలుండవు: ట్రంప్
- భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ట్రంప్ సమావేశం
- సరైన వ్యక్తులను ఎన్నుకుంటేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమని వెల్లడి
- ప్రైవేట్ రంగం ఉద్యోగాలను సృష్టించగలదని వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో వాణిజ్య చర్చల అనంతరం భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ లో అద్భుతమైన స్వాగతం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో రిపపబ్లికన్లకు స్పష్టమైన ఆధిక్యం రావడంతో సంస్కరణలకు అవకాశం లభించిందని తెలిపారు. ఒబామా కేర్ ను మించిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే మార్కెట్లు దూసుకుపోవడం ఖాయమని అన్నారు. సరైన వ్యక్తులను ఎన్నుకుంటేనే ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. లేదంటే ఆర్థిక పురోభివృద్ధి కుంటుపడుతుందని, నిరుద్యోగం పెరుగుతుందని తెలిపారు. ఉన్న ఉద్యోగాలను మాత్రమే ప్రభుత్వం ఇవ్వగలదని, కానీ ప్రైవేట్ రంగం ఉద్యోగాలను సృష్టించగలదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
చైనాతో సంబంధాల గురించి చెబుతూ, మొదట చైనాయే వాణిజ్య యుద్ధం మొదలుపెట్టిందని ఆరోపించారు. తొలుత అదనపు సుంకాలు విధించింది చైనావాళ్లేనని తెలిపారు. అందువల్లే తాము కూడా సుంకాలు విధించాల్సి వచ్చిందని వివరించారు. తాము విధించిన అదనపు సుంకాల నిధులను రైతులకే బదిలీ చేశామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ పై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మాట్లాడినట్టు చెప్పారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చైనా సర్వశక్తులు ఒడ్డి శ్రమిస్తోందని పేర్కొన్నారు. కరోనా విషయంలో చైనాలో పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా మోదీపై ప్రశంసలు జల్లు కురిపించారు. మీ ప్రధాని ఎంత మంచివాడో అంతటి అసాధ్యుడు కూడా అంటూ ఆకాశానికెత్తేశారు. భారత్ తో భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు పురోగతి పథంలో పయనిస్తున్నాయని అన్నారు. ఈ ఒప్పందాలకు ముందు కొన్ని చట్టపరమైన అడ్డంకులు అధిగమించాల్సి ఉందని తెలిపారు. మరో ఆరేడు నెలల్లో ఒప్పందం కార్యరూపు దాల్చుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.