New Delhi: అర్ధరాత్రి ఢిల్లీ హైకోర్టు అత్యవసర విచారణ.. ఢిల్లీ హింసలో గాయపడిన వారికి చికిత్సకు ఆదేశాలు
- ఢిల్లీలో చెలరేగిన హింస
- గాయపడిన వందలాదిమంది
- కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశం
ఢిల్లీ హింసాకాండలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను కట్టుదిట్టమైన భద్రత మధ్య సురక్షితంగా ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించాలని గత అర్ధరాత్రి ఢిల్లీ హైకోర్టు అత్యవసరంగా ఆదేశాలు జారీ చేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, అనుకూలంగా నిన్న జరిగిన ఆందోళనలు హింసకు దారితీశాయి.
ఈ క్రమంలో పదుల సంఖ్యలో ఆందోళనకారులు మరణించగా, వందలాదిమంది గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు వచ్చిన వాహనాలను ముందుకు కదలకుండా ఆందోళనకారులు అడ్డుకుంటున్నారని, వారికి సరైన భద్రత కల్పించి సురక్షితంగా ఆసుపత్రికి వెళ్లే ఏర్పాట్లు చేయాలంటూ సురూర్ మాండర్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
మంగళవారం అర్ధరాత్రి ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించిన న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్.. హింసలో గాయపడిన వారిని చికిత్స కోసం జీటీబీ ఆసుపత్రి, ఎల్ఎన్జేపీ, మౌలానా ఆజాద్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు సురక్షితంగా తరలించాలని, అవసరమైన భద్రత కల్పించాలని ఆదేశించారు.