Donald Trump: ప్చ్.. ట్రంప్ పర్యటనపై పెదవి విరిచిన విదేశీ మీడియా!
- ట్రంప్ పర్యటనను ప్రజాకర్షకంగా మలచడానికి భారత్ ప్రయత్నించింది: వాషింగ్టన్ పోస్టు
- కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సిద్ధమని భారత గడ్డపైనుంచే ట్రంప్ ప్రకటించారు: డాన్
- ఇద్దరివీ రాజకీయ అవసరాలే: అల్ జజీరా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై విదేశీ మీడియా పెదవి విరిచింది. ట్రంప్ పర్యటన వల్ల భారత్‌కు ఒరిగిందేమీ లేదని తేల్చేసింది. మోదీ మొండిఘటమని ట్రంప్ వ్యాఖ్యానించడం ద్వారా వాణిజ్య చర్చల్లో పురోగతి తప్ప ఒప్పందం కుదరదన్న విషయం అర్థమైపోయిందని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది.
నమస్తే ట్రంప్ సభను హౌడీమోదీ-2గా అభివర్ణించిన న్యూయార్క్ టైమ్స్.. ట్రంప్ పర్యటనను పీఆర్ వ్యవహారంగా మార్చేశారని, ట్రంప్ పర్యటనను ప్రజాకర్షకంగా మలచడానికి భారత్ ప్రయత్నించిందని విమర్శించింది. అహ్మదాబాద్‌లోని మురికివాడలు ట్రంప్‌కు కనిపించకుండా గోడ కట్టిన విషయాన్ని ప్రస్తావించింది. అయితే, ట్రంప్ పర్యటనను చిరస్మరణీయం కాదనలేమని ముక్తాయింపు ఇచ్చింది.
ట్రంప్ భారత పర్యటన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు బాగా పనికొస్తుందని బీబీసీ పేర్కొంది. ఇండియాలో ఆయన పర్యటన సందర్భంగా హాజరైన జనం విజువల్స్‌ను ట్రంప్ వినియోగించుకుంటారని పేర్కొంది. ఇవి చూపించి విదేశాల్లో తనకు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో చెప్పుకుంటారని రాసుకొచ్చింది. మోదీతో చెట్టపట్టాలేసుకుని తిరగడం ద్వారా అమెరికాలోని భారతీయుల మనసుల్ని గెలుచుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని పేర్కొంది.
గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో స్వాగతం అందుకోలేకపోయిన ట్రంప్‌కు ఈ పర్యటన సంతోషాన్ని ఇచ్చిందని సీఎన్ఎన్ పేర్కొంది. ఆయనకు హంగు ఆర్భాటాలంటే మహా ఇష్టమని తెలిపింది. పెద్ద ఒప్పందాలేవీ లేకుండానే ట్రంప్ భారత పర్యటన ముగిసిందని వివరించింది. హౌడీ మోదీ సభకు ప్రతిస్పందనే నమస్తే ట్రంప్ సభ అని పాక్ పత్రిక డాన్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య బలమైన ఒప్పందాలేవీ జరగలేదని పేర్కొంది. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్టు భారత్ గడ్డపై నుంచే ట్రంప్ ప్రకటించారని పేర్కొంది.
పరస్పర ప్రశంసలు, వ్యక్తిగత స్నేహాన్ని ఆవిష్కరించడం తప్ప ఈ పర్యటనలో ట్రంప్ సాధించినదేమీ లేదని ‘ది గార్డియన్’ తేల్చేసింది. ట్రంప్ రాకతో ప్రజల్లో ఉత్సాహమే తప్ప ఇరు దేశాల మధ్య పెద్ద ఒప్పందాలేవీ కుదరలేదని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. వ్యక్తిగత సంబంధాన్ని వెల్లడించేందుకు ట్రంప్, మోదీ తాపత్రయపడ్డారని అల్ జజీరా పేర్కొంది. ఇద్దరివీ రాజకీయ అవసరాలేనని తేల్చేసింది.