CAA: ఢిల్లీ అల్లర్లలో 17కు పెరిగిన మృతుల సంఖ్య.. నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ
- కల్లోల ప్రాంతాలను పరిశీలించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- ఆందోళనలపై నేటి మధ్యాహ్నం విచారణ జరపనున్న ఢిల్లీ హైకోర్టు
- ఈశాన్య ఢిల్లీలో కొనసాగుతున్న ఉద్రిక్తత
సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. మంగళవారం మధ్యాహ్నం నుంచీ బుధవారం అర్ధరాత్రి వరకు సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. వందలాది మంది గాయపడ్డారు. రాళ్లు విసురుకోవడాలు, దుకాణాల విధ్వంసం, రోడ్లపై టైర్లు వేసి నిప్పుపెట్టడం, వాహనాలు తగలబెట్టడం వంటి ఘటనలు జరిగాయి. దాంతో ఈశాన్య ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధించారు. ఆయా ప్రాంతాల్లోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు, స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు.