Corona Virus: నాకు కరోనా వైరస్ సోకింది: ఇరాన్ మంత్రి
- ఇరాన్ పై పంజా విసిరిన కరోనా వైరస్
- ఇప్పటి వరకు 15 మంది మృతి
- మొత్తం 95 మందికి సోకిన కరోనా వైరస్
చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ నెమ్మదిగా ప్రపంచానికి విస్తరిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కొన్ని దేశాల్లో మరణాలు కూడా నమోదయ్యాయి. తాజాగా ఓ రాజకీయ ప్రముఖుడు కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకిందంటూ ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ హరిర్చి స్వయంగా ప్రకటించారు.
గత సోమవారం ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న సమయంలో ఆయన పదేపదే దగ్గుతుండటం కనిపించింది. అంతేకాదు, ఆయనకు చెమటలు కూడా పట్టాయి. కోమ్ నగరంలో కరోనా వైరస్ బారిన పడి 50 మంది చనిపోయారనే ఆరోపణలకు సమాధానమిస్తూ... ఆ వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. చివరకు ఆయనే ఆ మహమ్మారి బారిన పడటం విచారకరం.
తనకు కరోనా సోకిదంటూ హరిర్చి అధికారికంగా ప్రకటించారు. సోమవారం రాత్రి తనకు జ్వరం వచ్చిందని... అర్ధరాత్రి తనకు చేసిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలిందని ఆయన చెప్పారు. అప్పటి నుంచి తనకు తానుగా ఒక ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నానని తెలిపారు. ఇప్పుడు తాను ధ్యానం చేస్తున్నానని చెప్పారు. రానున్న కొన్ని వారాల్లో ఈ వైరస్ పై మనం విజయం సాధిస్తామనే విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పగలనని అన్నారు.
ఈ వైరస్ చాలా ప్రమాదకారి అని... ఇరాన్ ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా హెచ్చరించారు. మరోవైపు, ఇప్పటి వరకు దేశంలో కరోనా బారిన పడి 15 మంది చనిపోయారని, 95 మందికి ఈ వైరస్ సోకిందని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.