New Delhi: ప్లీజ్...సంయమనం పాటిద్దాం: ఢిల్లీ ఆందోళనకారులకు క్రికెటర్ సెహ్వాగ్ విజ్ఞప్తి
- శాంతియుత సహజీవనానికి పెట్టింది పేరు రాజధాని
- ఆ పేరుకు మచ్చవచ్చే పని మనం చేయవద్దు
- హింసాత్మక ఘటనలకు స్వస్తి పలకాలని వేడుకుంటున్నా
రాజధానిలో కలిసిమెలసి నివసిస్తున్న మనమంతా సంయమనం పాటించి ఇక్కడి శాంతియుత వాతావరణాన్ని కాపాడుదామని టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్రసెహ్వాగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై మూడు రోజులుగా ఈశాన్య ఢిల్లీలో అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ ఘర్షణల్లో రెండు వర్గాలకు చెందిన 18 మంది ఇప్పటికే మృతి చెందారు. దాదాపు 180 మంది గాయపడగా అందులో 48 మంది పోలీసులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా సెహ్వాగ్ స్పందించారు.
‘ప్రశాంత వాతావరణానికి నిలయమైన ఢిల్లీలో ఈ ఘటనలు బాధ కలిగిస్తున్నాయి. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న గొప్పదేశానికి రాజధాని మన ఢిల్లీ. అటువంటి చోట ఏ ఒక్కరికి చిన్న గాయమైనా అది దేశానికే మచ్చ తెస్తుంది. అందువల్ల అంతా శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని కోరుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు.