Virat Kohli: పేలవంగా అవుటై విమర్శలపాలైన పృథ్వీ షాకు కెప్టెన్ కోహ్లీ బాసట
- న్యూజిలాండ్ పర్యటనలో విఫలమవుతున్న పృథ్వీ షా
- కుదురుకునేందుకు కొంత సమయం ఇవ్వాలన్న కోహ్లీ
- పృథ్వీ ఊపులోకి వస్తే ఆట స్వరూపమే మారిపోతుందని వ్యాఖ్యలు
ముంబయి యువ బ్యాట్స్ మన్ పృథ్వీ షా దాదాపు ఏడాది విరామం తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. మొదట డోప్ టెస్టులో విఫలం కావడం, ఆ తర్వాత గాయంతో జట్టులో చోటు కోల్పోవడం జరిగింది. అయితే న్యూజిలాండ్ పర్యటన కోసం పృథ్వీ షాను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. కానీ, ఈ ముంబయి యువ కిశోరం ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో విమర్శకులు తేలిగ్గానే దొరకబుచ్చుకున్నారు. ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ ను తీసుకోకుండా, పృథ్వీని ఎందుకు తీసుకున్నారంటూ వ్యాసాలు రాశారు. ఈ నేపథ్యంలో, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు.
"ఇక్కడి పిచ్ లపై పేస్, బౌన్స్ ను అర్థం చేసుకోవడంలోనే విషయం దాగి ఉంది. ఒక్కసారి అతను మైండ్ సెట్ చేసుకున్నాడంటే అతను మరింత విధ్వంసకరంగా ఆడతాడు. ఊపులోకి వచ్చాడంటే ఆట స్వరూపమే మారిపోతుంది. అందరు బ్యాట్స్ మెన్ లాగానే పృథ్వీ కూడా బాగా ఆడాలనే బరిలో దిగుతాడు. అయితే కుదురుకునేందుకు అతనికి కొంత సమయం ఇవ్వాలి. పరిస్థితులకు అలవాటుపడితే స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపిస్తాడు. తొలిసారి సొంతగడ్డ దాటి విదేశీ సిరీస్ ఆడుతున్నందున అంతర్జాతీయ స్థాయిలో బౌలింగ్ దాడులు ఎలా ఉంటాయన్నది అతడికి కూడా ఓ అవగాహనకు వస్తుంది" అంటూ కోహ్లీ అభిప్రాయపడ్డాడు.