New Delhi: ఢిల్లీలో వెల్లివిరిసిన మతసామరస్యం.. బాధిత ముస్లింలకు హిందువుల బాసట
- ఢిల్లీ అల్లర్లలో ఇళ్లు కోల్పోయిన వారికి ఆశ్రయం
- నిరాశ్రయులైన 40 మందికి అండ
- ఈశాన్య ఢిల్లీ అశోక్ నగర్లో వెల్లివెరిసిన సోదరభావం
ఢిల్లీ అల్లర్లలో 40 మంది ముస్లింల ఇళ్లు కాలిపోయాయి. వాళ్ల జీవనోపాధి నాశనమైంది. కనీసం తలదాచుకోవడానికి గూడు కూడా కరవైంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకు హిందువులు ఆపన్న హస్తం అందించారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలో చెలరేగిన హింసలో సర్వం కోల్పోయిన వారి జీవితాల్లో ఆశ చిగురింపజేశారు. ఈశాన్య ఢిల్లీలోని అకోశ్ నగర్లో కనిపించిందీ దృశ్యం.
ముస్లిం కుటుంబాలే లక్ష్యంగా దాడులు
మంగళవారం చెలరేగిన హింసలో కొంతమంది దుండగులు పలువురు ముస్లింల ఇళ్లు, దుకాణాలకు నిప్పు పెట్టారు. గుంపుగా వచ్చిన వెయ్యి మంది ఆందోళనకారులు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాడి మసీదుకు సమీపంలో ఉన్న కాలనీలో బీభత్సం సృష్టించారు. ఆ మసీదులోకి చొరబడి నిప్పు పెట్టారని ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు.‘దుండగుల్లో కొందరు మసీదుపైకి ఎక్కి జాతీయ పతాకం, కాషాయ జెండాను ఎగురవేశారు. మా ఆస్తులను ధ్వంసం చేయొద్దని మేమంతా ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. వాళ్లు ఇక్కడి వాళ్లు కాదు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారే. అందరూ ముఖాలకు ముసుగులు ధరించారు. ఎంచుకున్న దుకాణాలను తగులబెట్టిన అనంతరం..కాలనీలో నివాసం ఉంటున్న మా ఆరు ముస్లిం కుటుంబాల ఇళ్లపై పడ్డారు. మొత్తం ధ్వంస చేశారు’ అని మహమ్మద్ రషీద్ అనే బాధితుడు తెలిపాడు.
సర్వం కోల్పోయి తామంతా రోడ్డు మీద పడగా.. పక్కనే ఉన్న హిందు స్నేహితులు తమకు ఆశ్రయం కల్పించారని చెప్పాడు. 25 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో తామంతా కలిసే ఉంటున్నామని, ఇన్నేళ్లలో హిందువులకు, తమకు మధ్య ఏ చిన్న గొడవా జరగలేదని చెప్పాడు. అందరం కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటున్నామని తెలిపాడు.