N.T. Rama Rao: బాపు - రమణలకు ఎప్పటికీ రుణపడి వుంటాను: హాస్య నటుడు గుండు సుదర్శనం
- తొలి సినిమానే ఎన్టీఆర్ తో చేశాను
- మహానటుడి గురించి మాటల్లో చెప్పలేం
- ఎన్టీఆర్ ఒక గ్రంధాలయమన్న సుదర్శన్
హాస్య నటుడిగా గుండు సుదర్శనం మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బాపు సినిమాల్లో ఆయన తప్పకుండా వుండేవారు. అలాంటి గుండు సుదర్శనం తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "తెలుగులో నా తొలి సినిమా 'శ్రీనాథ కవి సార్వభౌమ'. తొలి సినిమాలోనే ఎన్టీ రామారావుగారితో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. పద్యాలు .. డైలాగులతో కూడిన ముఖ్యమైన సన్నివేశాలను ఆయనతో కలిసి చేయడం నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అధ్యాయం లాంటిది.
ఎన్టీ రామారావుగారితో కలిసి నటించింది నేనేనా? అని ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అవకాశాన్ని నాకు కలిగించిన బాపు - రమణ గార్లకు నేను ఎప్పటికీ రుణపడి వుంటాను. ఎన్టీ రామారావుగారు మహానుభావుడు .. మహానటుడు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక గ్రంధం చదివితే అందులో ఏం వుందో తెలుస్తుంది. గ్రంధాలయంలోని గ్రంధాలన్నింటినీ చదివితే ఎంత నేర్చుకోవచ్చో, ఎన్టీఆర్ గారి నుంచి అంత నేర్చుకోవచ్చు. అంకితభావానికీ .. క్రమశిక్షణకు ఆయన ప్రతిరూపం అని చెప్పుకోవచ్చు" అని అన్నారు.