Taj Mahal: తాజ్‌మహల్‌ను మర్చిపోలేకపోతున్న మెలానియా!
- అమెరికా వెళ్లిన తర్వాత తాజ్‌ను గుర్తు చేసుకున్న ట్రంప్ భార్య
- తాజ్‌ను సందర్శించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్
- అద్భుత కట్టడమని కితాబు
భారత పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ భారత్‌లో గడిపిన అద్భుత క్షణాలను నెమరు వేసుకుంటున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించిన మెలానియా దాని అందాలకు ఫిదా అయ్యారు.
తన భర్త, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి సోమవారం సాయంత్రం తాజ్‌మహల్‌కు వచ్చిన ఆమె దాదాపు గంటపాటు అక్కడే ఉన్నారు. తన ప్రేమకు గుర్తుగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఈ చారిత్రక కట్టడానికి తొలిసారి వచ్చిన ట్రంప్ దంపతులు చేతిలో చెయ్యి వేసుకొని అంతా కలియ తిరిగారు. తాజ్ ప్రత్యేకతల గురించి ఓ గైడ్ వారికి వివరించారు.
ఈ వీడియోను మెలానియా ట్విటర్లో పోస్ట్ చేశారు. ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ అద్భుతంగా ఉందని కొనియాడారు. అలాగే, తాజ్ మహల్ ముందు ట్రంప్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేసిన ఆమె..‘పోటస్ అండ్ ఫ్లోటస్ ఎట్ తాజ్ మహల్’ అని అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ కాగా.. ఫ్లోటస్ అంటే ఫస్ట్ లేడీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్.