- పొగ కారణంగా ఊపిరాడక వృద్ధురాలు మృతి
- ఢిల్లీ ఆందోళనలపై రాష్ట్రపతికి సోనియా గాంధీ ఫిర్యాదు
- కేజ్రీవాల్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో చెలరేగిన ఆందోళనల్లో మృతుల సంఖ్య 34కు చేరింది. ఇప్పటివరకు 200 మందికిపైగా గాయపడినట్టు గుర్తించారు. ముఖ్యంగా ఆందోళనల సమయంలో దుకాణాలు, ఇళ్లకు నిప్పు పెట్టడంతో వాటిల్లో ఉన్నవారు గాయపడిన ఘటనలు బయటికి వస్తున్నాయి. భారీగా పోలీసులు, పారా మిలటరీ బలగాలు మోహరించడంతో ప్రస్తుతానికి అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఆ ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తతే..
యాంటీ సీఏఏ ఆందోళనలకు కీలక కేంద్రాలుగా ఉన్న మౌజ్ పూర్, భజన్ పురా, కరవాల్ నగర్, జఫరాబాద్ తదితర ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లలోంచి ఎవరూ బయటికి రావడం లేదు. ఢిల్లీ హైకోర్టు కూడా గట్టిగా అక్షింతలు వేయడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఊపిరాడక చనిపోయిన వృద్ధురాలు
ఆందోళనకారులు ఓ దుకాణాన్ని తగల బెట్టడంతో వచ్చిన పొగ కారణంగా పక్కనే ఉన్న ఇంట్లో ఓ వృద్ధురాలు ఊపిరాడక చనిపోయింది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినా గురువారం వెలుగులోకి వచ్చింది.
అమిత్ షాపై సోనియా ఫిర్యాదు
ఢిల్లీ ఆందోళనలను నియంత్రించడంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి వెళ్లి రాష్ట్రపతి కోవింద్ తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.