Shefali Varma: తనతో ప్రాక్టీస్ చేసిన అబ్బాయిలకు కృతజ్ఞతలు తెలిపిన టీమిండియా మహిళా సంచలనం
- టి20ల్లో దుమ్మురేపుతున్న షెఫాలీ వర్మ
- 147 స్ట్రయిక్ రేట్ తో విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన
- న్యూజిలాండ్ పైనా మెరుపుదాడి
- అబ్బాయిలతో ప్రాక్టీస్ వల్లే వేగంగా ఆడగలుగుతున్నట్టు వెల్లడి
టీమిండియా మహిళల క్రికెట్ మునుపెన్నడూ లేనంత బలోపేతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 16 ఏళ్ల టీనేజ్ అమ్మాయి షెఫాలీ వర్మ రాకతో ఓపెనింగ్ అదిరిపోతోంది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో వరుసగా మూడు మ్యాచ్ ల్లో నెగ్గి సెమీస్ కు చేరిందంటే అందులో షెఫాలీ పాత్ర కూడా ఉంది. సెహ్వాగ్ ను తలపించే దూకుడుతో మహిళల క్రికెట్ లో పవర్ హిట్టింగ్ ను పరిచయం చేసిన ఈ డాషింగ్ ఓపెనర్ టి20 క్రికెట్ లో (147.97) తిరుగులేని స్ట్రయిక్ రేట్ తో కొనసాగుతోంది. ఇవాళ న్యూజిలాండ్ తో మ్యాచ్ లోనూ మెరుపుదాడి చేసి 34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 46 పరుగులు చేసింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, అబ్బాయిలతో ప్రాక్టీస్ చేయడం వల్లే తాను ధాటిగా ఆడగలుగుతున్నానని వెల్లడించింది. అందుకే తనతో ప్రాక్టీస్ చేసిన అబ్బాయిలకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని వివరించింది. వాళ్ల కారణంగానే తన బ్యాటింగ్ కు దూకుడు తోడైందని, వేగంగా ఆడగలుగుతున్నానని తెలిపింది. బంతిని టైమింగ్ చేయడంతో పాటు బలంగా బాదడం తన సామర్థ్యం అని పేర్కొంది.