Revanth Reddy: ఇవాంకా యోగక్షేమాలు మీకు అవసరమా?: సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ధ్వజం
- ట్రంప్ విందుకు హాజరైన సీఎం కేసీఆర్
- కంది రైతుల సమస్యలపై దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి హితవు
- కంది రైతులకు మద్దతుగా సీఎంకు లేఖాస్త్రం
తెలంగాణలో కంది రైతుల సమస్యలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గళం విప్పారు. రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన ఆయన, రెండ్రోజుల్లో కంది రైతుల సమస్యలపై స్పందించకపోతే 'రైతు గోస' పేరుతో తాను కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ విందుకు హాజరై ఇవాంకా ట్రంప్ యోగక్షేమాలు అడగడం ముఖ్యమా? లేక, కంది రైతుల సమస్యలు తీర్చడం ముఖ్యమా? అంటూ కేసీఆర్ ను నిలదీశారు.
కంది పంట విస్తీర్ణం మొదలుకుని, పంట దిగుబడి వరకు ప్రతి విషయంలో ప్రభుత్వం అంచనాలు విఫలం అయ్యాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కంది కొనుగోళ్ల అంశంపై ప్రయివేటు వ్యాపారులకు మద్దతుగా నిలుస్తోందన్న భావన కలుగుతోందని పేర్కొన్నారు. రైతుల నుంచి కందులు ఎందుకు కొనుగోలు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.