Arvind Kejriwal: మీ కేబినెట్లో మహిళలకు చోటివ్వండి.. కేజ్రీవాల్ కు ఎన్‌సీడబ్ల్యూ లేఖ
- మంత్రి మండలిలో మహిళలకు అవకాశం ఇవ్వని కేజ్రీవాల్
- ఈ విషయంపై కమిషన్ లో పిటిషన్ దాఖలు
- కనీసం ఇద్దరినైనా తీసుకోవాలని కమిషన్ సూచన
ఢిల్లీ కేబినెట్లో మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం లేఖ రాసింది. ఇటీవల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ తమ మంత్రి మండలిలోకి ఒక్క మహిళను కూడా తీసుకోలేదు. దాంతో, సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు వచ్చాయి.
ఢిల్లీ మంత్రి మండలిలో కనీసం ఒక్క మహిళా సభ్యురాలికైనా చోటు కల్పించాలని కోరుతూ ఎన్‌సీడబ్ల్యూలో పిటిషన్ దాఖలైంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖ శర్మ ... కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. అన్ని రంగాల్లో మహిళలకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో, నాయకత్వాన్ని పంచుకోవడంలో సమానత్వం ఉండాలని లేఖలో పేర్కొన్నారు. విధానపర నిర్ణయాల్లో తమ అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం మహిళలకు ఇవ్వాలన్నారు. అందుకోసం కనీసం ఇద్దరు మహిళలనైనా కేబినెట్‌లోకి తీసుకోవాలని కేజ్రీవాల్‌కు సూచించారు.