Roja: ఉత్తరాంధ్ర, రాయలసీమకు బాబు వస్తే ప్రజలే స్వచ్ఛందంగా తరిమికొడతారనడానికి ఇది నిదర్శనం: రోజా
- చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
- ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించేందుకు బాబు ప్రయత్నిస్తున్నారన్న రోజా
- చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని విమర్శించిన గుడివాడ అమర్నాథ్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే. చంద్రబాబును వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకోగా భద్రతా కారణాల రీత్యా పోలీసులు ఆయనను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రజాప్రతినిధులు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ, ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం చేశారని, కానీ ఉత్తరాంధ్ర, రాయలసీమకు బాబు వస్తే ప్రజలే స్వచ్ఛందంగా తరిమి కొడతారనడానికి ఇదే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాబు అడ్డుపడుతున్నారని, వికేంద్రీకరణ చేస్తే బాబుకు కడుపు మంట ఎందుకు అని ప్రశ్నించారు.
అటు గుడివాడ అమర్నాథ్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అమరావతి తప్ప రాష్ట్రాభివృద్ధి అవసరం లేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర ద్రోహి కాబట్టే చంద్రబాబును ప్రజలు విశాఖ ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారని అన్నారు. అబివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు పలికిన తర్వాతే చంద్రబాబు విశాఖలో అడుగుపెట్టాలని వైసీపీ మహిళా నేత కిల్లి కృపారాణి స్పష్టం చేశారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న బాబు ఉత్తరాంధ్ర కోసం చేసిందేమీ లేదని ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు